భద్రాచలం వరద ముంపునకు గురైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్లే భద్రాచలం వరద ముంపునకు గురి అయిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.” పోలవరం ఎత్తు ఎవరు పెంచారు?. డిజైన్ల ప్రకారమే జరుగుతుంది. దాన్ని ఎవరూ మార్చలేదు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలోనూ ప్రస్తావించిన అంశమే.
విభజన చట్టం ప్రకారమే అంతా జరుగుతోంది. వందేళ్ల తరువాత మొదటిసారి ఈ నెలలో గోదావరి కి ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చింది. రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ ఆదాయాన్ని ఏపీ కోల్పోయింది. హైదరాబాద్ నీ ఏపీలో కలిపమని అడగగలమా. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కనిపిస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. కొందరు వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాల్సి ఉంది. సీఎం అయినా మంత్రులైన బాధ్యతగానే మాట్లాడాలి.
రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదు. పువ్వాడ అజయ్ అయన సంగతి ఆయన చూసుకోవాలి. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. పువ్వాడ అజయ్ ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి ఆయన చూసుకుంటే సరిపోతుంది. ముంపు మండలాల ప్రజలు ఏపీ రాష్ట్ర కుటుంబ సభ్యులు. వారి సంగతి మేము చూసుకుంటాం.” అని అన్నారు బొత్ససత్యనారాయణ.