ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో జరగబోయే పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని తమ పార్టీ నిర్ణయించదని తెల్చి చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది తీసుకునే నిర్ణయం ఆధారంగానే సీఎం అభ్యర్థి ప్రకటన ఉంటుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ను కూడా కేటాయించారు.
7074870748 అనే నెంబర్ కు పంజాబ్ రాష్ట్ర ప్రజలు సీఎం అభ్యర్థిపై తమ నిర్ణయం తెలపాలని కోరారు. ఫోన్ చేయడం లేదా మెసేజ్ లేదా వాట్సప్ ఇలా ఎదైనా ఒక దానితో సీఎం అభ్యర్థి పై తమ నిర్ణయం తెలపాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. జనవరి 17 వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ప్రజలు తమ నిర్ణయం తెలపాలని కోరారు.
ఇలా ప్రజల నిర్ణయంతో సీఎం అభ్యర్థిని ఎన్నుకోవడం దేశ రాజకీయ చరిత్రలోనే ఇదే మొదటి సారి అని ఆయన అన్నారు. కాగ పంజాబ్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ను కేజ్రీవాల్ ఎంపిక చేశారనే వార్తలను ఆయన ఖండించారు. ప్రజల ద్వారా సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలనే నిర్ణయం భగవంత్ మాన్ సూచించారని తెలిపారు.