పూరీ జగన్నాథ్ మాటలు చాలా సూటిగా ఉంటాయి. సినిమాల్లో డైలాగులైనా, సాధారణంగా మాట్లాడినా గుండెల్లోకి దిగిపోతాయి. తాజాగా పూరీ మ్యూజింగ్స్ లో జీవిత గీతాన్ని వినిపించాడు. ఈ జీవితం నీది. నీకు నచ్చిందే చెయ్, ఇంట్లో వాళ్లతో జాగ్రత్తగా ఉండు. నవ్వుతూ తీసుకెళ్ళి నదిలోకి నూకేస్తారు. మన బతుకే మూణ్ణాళ్ళ ముచ్చట. దీనిలో అనవసర విషయాలైన పెళ్ళి పెంటలోకి దిగద్దు. అదొక్కటి చాలు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. పెళ్ళి చేసుకున్నాక ఎన్ని తత్వాలు తెలుసుకున్న పెద్ద ప్రయోజనం ఉండదు.
జీవితమంటే అందమైన కరీబియన్ క్రూయిజ్ ట్రిప్పులా ఉండాలి. నువ్వు కన్న కలలన్నీ కాగితం మీద రాసుకో. నీ కలలో నువ్వెప్పుడూ ఒంటరివే. అందుకే ఒంటరిగా ఉంటేనే నీ కలలు నెరవేరుతాయి. ఎవ్వరికీ ఏ ప్రామిస్ చేయద్దని నీకు నువ్వు ప్రామిస్ చేసుకో. జీవితాన్ని ఒకేలా బ్రతక్కు. చెమట చిందించు, చొక్కా తడవాలి, అలసిపో. అలసిపోతేనే పడుకో. చిన్నపిల్లాడిలా నిద్రపో. దేనికీ భయపడద్దు. భయపడితే కిడ్నీలు పాడవుతాయి. ప్రతీదానికి ఒత్తిడి ఫీల్ అయితే గుండెపోటు ఖాయం.
మతాలు, గ్రంథాలు మనకెందుకు, కుక్కలా సరదాగా ఉండగలిగితే చాలు. కొంచెం హాస్యరసం ఉంటే చాలు. సమాజాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. పని చేసుకో, దాచుకో, అమ్మా నాన్నని, నా అన్న వాళ్ళని చూసుకో. అలా ఆకాశంలోకి చూడు. పక్షులు ఎక్కడికో వలసపోతున్నాయి. నువ్వు మాత్రం ఇక్కడే ఎందుకుంటావు. అలా ప్రపంచం చుట్టెయ్. ప్రేమించుకుంటూ వెళ్ళు, మనుషులు గానీ, జంతువులు గానీ అన్నింటినీ ప్రేమించు.
వయసు మీద పడుతుందని ఆలోచించకు. అరవై దగ్గర పడుతుంటే ఒంట్లో ఉన్న కొవ్వు కరిగించెయ్. గిటార్ కొనుక్కో, క్లాసులకి వెళ్ళు, రోజూ కాఫీ తాగు, కుడిచేత్తో చేసే పన్లన్నీ ఎడమ చేత్తో చేయడం అలవాటు చేసుకో. ఇలా లైఫ్ ని ఛాలెంజింగ్ గా, ఆనందంగా గడిపెయ్. ఎప్పుడు పోతామో ఎవ్వరికీ తెలియదు అంటూ తన జీవిత గీతాన్ని అందరితో పంచుకున్నాడు.