తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని రఘునందన్ రావు స్పష్టం చేశారు. పదేండ్ల నుంచి పార్టీకి సేవలందిస్తున్నా.. తాను అధ్యక్ష పదవికి అర్హుడిని కాదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రఘునందన్ రావు బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని, మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా..? పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్‌లో ఏదో ఒకటి పదవి ఇవ్వాలి.
జాతీయ అధికార ప్రతినిధి ఇచ్చినా తనకు ఓకే అని చెప్పారు. గత పదేండ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని గుర్తు చేశారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు రఘునందన్ రావు. అయితే.. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే రఘునందన్ రావు యూటర్న్ తీసుకున్నారు. మాట మార్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. నేను మీడియా మిత్రులతో చాయ్ తాగుతూ సరదాగా మాట్లాడిన మాటలు వక్రీకరించి రాశారన్నారు. నేను పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని రఘునందన్‌రావు అన్నారు.