ఏపీలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో లో పలు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలో వరదల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టం కూడా జరిగింది. దాంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వరదల కారణంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం వాటిల్లింది. ఇదిలా ఉండగానే ఈరోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టంచేసింది. చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా డిసెంబర్ 3 నుండి 5 వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.