మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక చల్లని వార్త చెప్పింది వాతావరణ శాఖ. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు వారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు ఊరట నిస్తున్నాయి. ఇక తెలంగాణలో ఈ రోజు నైరుతి ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఆవర్తనము వ్యాపించింది. రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా మీదగా వెళ్ళే అవకాశం ఉంది.
ఈ రోజు అల్పపీడన ప్రాంతం నుండి ఒడిస్సా మీదగా తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. దీంతో రాగల 3 రోజులు (10,11,12 వ.తేదీలు) ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమి వేగంతో)కూడిన వర్షం తెలంగాణాలో అన్ని జిల్లాలలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాలలో విస్తారంగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు ఉండటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తం అయింది. ఇందులో భాగంగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.