గత రెండు నెలలుగా వరస వాయుగుండాలు, వర్షాలతో అతలాకుతలం అయిన తమిళనాడు రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు చెన్నైతో జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలుగజేశాయి. చెన్నైలో వర్షాల కారణంగా ముగ్గురు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యుద్ఘాతంలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మరణించారు.
భారీ వర్షాల దృష్ట్యా తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చింగ్లేపేట సహా 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా వర్షాలు సంభవిస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, సబ్‌వేలు ముంపుకు గురయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తా తమిళనాడు మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పరిసర ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చిరించింది.