వనమా రాఘవ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు : రాజాసింగ్

బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్రకటన చేశారు. కొత్తగూడెం రామక్రిష్ణ కుటుంబం సూసైడ్ కు కారణమైన వనమా రాఘవను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన వెనుక ఉన్న అద్రుశ్య శక్తి ఎవరు? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు చేసే అరాచకాలకు సీఎం పత్తాసు పలుకుతున్నాడని.. వనమా రాఘవ ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే నిమిషాల్లో అరెస్టు చేసే పోలీసులు మానవ మ్రుగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం సిగ్గు చేటు అని.. అధికార పార్టీ నేతలు హత్యలు, హత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడవచ్చని సీఎం ప్రత్యేకంగా లైసెన్సులిచ్చారా? అని ప్రశ్నించారు. లేక అధికార పార్టీ నేతల అరాచకాలు ముఖ్యమంత్రికి, ఆయన కొడుకు కళ్లకు కన్పించకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారా? అని.. తక్షణమే వనమా రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే విచారణ సాఫీగా సాగే అవకాశం లేదని.. తక్షణమే ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలన్నారు. కొడుకుపై విచారణ జరిపేందుకు తండ్రి సహకరించాలని.. ఈ అంశంపై సమగ్ర విచారణను పూర్తి చేసి నిందితుడికి సాధ్యమైనంత తొందరగా శిక్ష ఖారారు చేసేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు రాజాసింగ్.