రాజస్థాన్ లో మహిళలకు మూడేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలతో పాటు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నవాన్ పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలోనే తమ రాష్ట్రంలో మహిళలకు మూడేళ్ల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలతో త్వరలోనే స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. చిరంజీవి యోజనతో అనుసంధానం అయిన దాదాపు 1.35లక్షల కుటుంబాల్లో మహిళలకు వీటిని త్వరలోనే పంపిణీ చేస్తామని తెలిపారు.
తమ ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను గహ్లోత్ ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలు, బడ్జెట్‌లో సుపరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అన్నీ చేస్తున్నామని.. ఆ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నామన్నారు.
మరోవైపు, కేంద్రంలోని మోదీ సర్కార్‌పై గహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. ఎప్పుడూ ప్రతిపక్షాల నాయకులపైనే దాడులు చేస్తున్నారని.. గత ఎనిమిదేళ్లలో భాజపా సభ్యులెవరిపైనా దాడులు జరగలేదన్నారు. కేవలం ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొనేందుకు ఆదాయపన్ను శాఖ, సీబీఐ వంటి సంస్థలకు కేంద్రం బాధ్యతలు అప్పగించిందని గహ్లోత్ ఆరోపించారు.