యోగా గురు రామ్ దేవ్ బాబా గురించి రెండు ముడు రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కరోనా కారణంగా లక్షల మంది చనిపోతున్నారని, అల్లోపతి స్టుపిడ్ సైన్స్ అని రామ్ దేవ్ బాబా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్ స్పందిస్తూ, రామ్ దేవ్ బాబా తన మాటలను ఉపసంహరించుకోవాలని కోరాడు. అన్నట్టుగానే రామ్ దేవ్ బాబా తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. ఐతే ఈ విషయం ఇంకా చల్లారలేదు. భారతీయ వైద్య సంఘం సెక్రటరీ జనరల్ జయేష్ లీల్ కౌంటర్ ఇచ్చాడు.
ఆజ్ తక్ ఛానల్ లో సాగిన డిబేట్ లో జయేష్ లీల్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఐతే ప్రస్తుతం రామ్ దేవ్ బాబా భారతీయ వైద్య సంఘానికి 25ప్రశ్నలు సంధించాడు. సోషల్ మీడియాలో పంచుకున్న ఓపెన్ లెటర్ లో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి.
డయాబెటిస్ టైప్ 1, టైప్ 2, హైపర్ టెన్షన్ మొదలగు వ్యాధులని అల్లోపతి పూర్తిగా నయం చేయగలదా?
ఆస్తమా, థైరాయిడ్, ఆర్థరైటిస్ మొదలగు వాటికి ఫార్మా ఇండస్ట్రీస్ వద్ద పూర్తిగా నయం చేసే చికిత్స ఉందా?
లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ కి అల్లోపతి వద్ద మందులు ఉన్నాయా? క్షయ, చికెన్ పాక్స్ కి ఉన్నట్టు కాలేయ వ్యాధులకు సరైన మందులు ఉన్నాయా? అల్లోపతి కేవలం 200సంవత్సరాల క్రితం నాటిది. గుండెలో రక్త ప్రసరణకి అడ్డంకులు ఏర్పడితే సర్జరీ కాకుండా మందుల మీద తగ్గే పద్దతులు ఉన్నాయా? కొవ్వుకి ఎలాంటి చికిత్స ఉంది? మైగ్రేన్ సి సరైన చికిత్స అల్లోపతిలో దొరుకుతుందా? సంతాన సాఫల్యత, పార్కిన్సన్, హీమోగ్లోబిన్ పెంచడానికి సరైన మందులు ఉన్నాయా అంటూ మొత్తం 25ప్రశ్నలతో కూడిన లెటర్ ను సోషల్ మీడియాలో పెట్టారు.