ఏ రంగంలో అయినా మార్పు అనేది అనివార్యం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో అయితే మార్పు అనేది చాలా కీలకం. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు తీయడంతో పాటు అప్పటి పరిస్థితులను ముందే అంచనా వేసి మూవీస్ తీసే క్రియేటివిటీ ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీ మనగలుగుతారు. అలా అప్పట్లో అనగా 1999లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీశారు ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు. ఆ చిత్రాలేంటో మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
రామోజీరావు పలు రంగాల్లో విజయం సాధించారు. మీడియా సంస్థ ఈనాడు, ఈటీవీలకు అధిపతి అయిన రామోజీరావు.. సినిమాలూ తీశారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పైన ఆయన అప్పట్లో తీసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా 1999లో ఆయన నిర్మాణ సారథ్యంలో వచ్చిన రెండు చిత్రాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఆ రెండు చిత్రాలు ‘చిత్రం’,‘నువ్వే కావాలి’.
తేజ అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రామోజీరావు నిర్మించిన చిత్రం ‘చిత్రం’. నూతన నటీనటులను ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు దర్శకుడు తేజ. ఇక ఆ తర్వాత కాలంలో తేజ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇంటర్ చదివే హీరో, హీరోయిన్స్ స్టడీ కంప్లీట్ కాక మునుపే పేరెంట్స్ అయితే ఎలా ఉంటుందనే స్టోరిలైన్ తో వచ్చిన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది.
‘చిత్రం’..‘ద పిక్చర్’ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ ఫిల్మ్ ద్వారా ఉదయ్ కిరణ్, రీమాసేన్ లు హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇక మరో సినిమా విషయానికొస్తే ‘నువ్వేకావాలి’.
‘నిరమ్’ అనే మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ పిక్చర్.. లో హీరో, హీరోయిన్లుగా తరుణ్, రిచా పల్లోడ్ నటించారు. ఫ్రెండ్స్ గా ఉన్న హీరో, హీరోయిన్స్ తమ మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే కాదు ప్రేమని చివరకు తెలుసుకోవడం తో కథ సుఖాంతమవుతుంది. కె.విజయ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించారు. కోటి అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.