బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్ ఆలియా భట్ ప్రస్తుతం బ్రహ్మాస్త్రం చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనెల 9న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. దీంతో ఈ చిత్ర యూనిట్ పలు విజయోత్సవ సభల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రణ్‌బీర్ తనకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
‘ఇద్దరూ బిజీ స్టార్లే కదా! ఒకరిపై ఒకరు ఆధారపడుతున్నారా?’అన్న ప్రశ్నకు రణ్‌బీర్ స్పందిస్తూ…‘నేను చాలా ఇండిపెండెంట్ అని గొప్పలు చెప్పుకుంటాను. కానీ, ఎక్కువ ఆలియా పైనే ఆధారపడుతున్నా. ఈ మధ్య ఆమె పక్కన లేకపోతే ఏ పనీ చేయలేకపోతున్నా. తినడం కూడా మానేసి ఆమె కోసం వెతుకుతున్నా. ఆమె ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ, నా పక్కన కూర్చోవాల్సిందే’ అంటూ చెప్పుకొచ్చాడు.
పక్కనే ఉన్న ఆలియా..రణ్‌బీర్ వ్యాఖ్యలకు నవ్వుతూ ఏకీభవించింది. ముఖ్యంగా రణ్‌బీర్ అన్నీ మర్చిపోతుంటాడని, నేను పక్కన ఉండి ప్రతీది గుర్తు చేస్తుంటానని చెప్పుకొచ్చింది. 2017నుంచి ప్రేమలో ఉన్న రణ్‌బీర్-ఆలియా జంట ఏప్రిల్ 14న వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు. జూన్‌లో తల్లిదండ్రులం కాబోతున్నాం అంటూ ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.
ప్రస్తుతం రణ్‌బీర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమాల్ అనే గ్యాంగ్‌స్టార్ డ్రామలో నటిస్తున్నాడు. ఇక ఆలియా రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే హిందీ చిత్రంతో పాటు, హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.