రాబోయే 20 నెలల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ చర్లపల్లి జైల్లో ఊచలు లెక్క పెడతారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెళ్ళిలో ఇవాళ దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మసులుతుందని.. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోతుందన్నారు. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉందని తెలిపారు. తుపాకీ తూటాల కు ఎదురొడ్డి పొరు చేసిన గడ్డ ఇది అని.. నాడు ఇంద్రవెల్లి కాల్పుల్లో అమరులైన కుటుంబాలను ఆదుకునే భాధ్యత కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ అంటే జోకుడు రామన్న, గుడులను గుడి లింగాన్ని మింగుతున్న ఇంద్ర కరణ్ రెడ్డి, బానిస సుమన్ ఈ జిల్లాకు పట్టిన చీడ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి సిఎం దళితుడు ఉన్నడా..? దరిద్రుడు ఉన్నాడా…? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దళితుడికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అవినీతి ముద్ర వేసి బయటకు పంపారు అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ కేబినెట్ లో మొదటి ఐదేళ్లు మహిళా మంత్రి కూడా లేరని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మంత్రివర్గంలో మాదిగలకు స్థానమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.