తెలంగాణ ప్రజలకు కెసిఆర్ సర్కార్ మరో షాక్ ఇవ్వనుంది. తెలంగాణ లో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని కెసిఆర్ ప్రభుత్వం యోచన చేస్తోంది. అదనంగా 4,500 కోట్ల రాబడికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని కెసిఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది కెసిఆర్ ప్రభుత్వం.
ఫిబ్రవరి 1 నుంచి ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది కెసిఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఎకరం కనీసం 30 లక్షల పైనే విలువ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 150 శాతం పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువతో పాటు 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన సర్కార్… వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో ఉంది. స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతం పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.