తెలంగాణ పీసీసీ ప్రతినిధుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పీసీసీ ప్రతినిధుల ఎంపికలో తీవ్ర గందరగోళం నెలకొందని హైకమాండ్ కు వివరించారు. పీసీసీ ప్రతినిధుల ఎంపిక కోసం తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ ఎన్నికల అధికారి చేతివాటం ప్రదర్శించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అర్హత కాని వారిని ఈ జాబితాలోకి చేర్చారని వారు విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడికి కానీ, ఇతర నాయకులకు తెలియకుండా పలువురిని జాబితాలో చేర్చడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
వాస్తవానికి ఒక్కో నియోజక వర్గానికి ఇద్దరు చొప్పున 119 నియోజక వర్గాలకు 238 మంది పీసీసీ ప్రతినిధులు ఉండాలి. అదేవిధంగా ఇందులో 15 శాతం కో-ఆప్షన్ సభ్యులను ఉంచాలి. అంటే ఈ లెక్కన చూసుకుంటే 274 మంది సభ్యులు ఉండాలి. కానీ ఏఐసీసీ ఎన్నికల అధికారి రూపొందించిన జాబితాలో 301 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో 27 మంది అదనంగా ఉండడం, వారిలో చాలా మంది అర్హులుకాని వారుండడంతో టీపీసీసీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.