హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన రాజకీయం మొదలైపోవడం ఖాయం. ఇప్పటికే నెక్స్ట్ ఎన్నికల టార్గెట్‌గానే టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపిలు రాజకీయం చేస్తున్నాయి. అయితే ఈ సారి మళ్ళీ ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదని కేసిఆర్ తేల్చి చెప్పేశారు. కాకపోతే గతేడాది ముందస్తు ఎన్నికలు జరిగాయి కాబట్టి…ఈ సారి పార్లమెంట్ ఎన్నికలకంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయం.
2023 చివరిలో అసెంబ్లీ ఎన్నికలు…2024 వేసవిలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రెండుసార్లు అధికారనికి దూరమైంది. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయంగా రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో రేవంత్..మళ్ళీ కొడంగల్ అసెంబ్లీలో పోటీకి దిగడం ఖాయమే. 2009, 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో మల్కాజిగిరీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే, ఖచ్చితంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు అప్పుడు ఆరు నెలల సమయం ఉంటుంది కాబట్టి.
ఇటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోమటిరెడ్డి నల్గొండ అసెంబ్లీలో, ఉత్తమ్ కుమార్ హుజూర్‌నగర్ అసెంబ్లీలో పోటీ చేస్తారు. గత ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీలో ఓడిపోయిన కోమటిరెడ్డి…ఆ తర్వాత భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే హుజూర్‌నగర్‌లో గెలిచిన ఉత్తమ్…పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, హుజూర్‌నగర్‌కు ఉపఎన్నిక రావడం జరిగాయి. ఆ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ గెలవడం జరిగింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరూ కూడా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలిస్తే, ఎంపీ పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుంది.