ఈసారి గెలిచేది మనమేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజున కొల్లాపూర్ లో సభ జరుపుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే తెలంగాణ ప్రజల ఆస్తిని ఆయన బంధువులకు దోచి పెడతారన్నారు. 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చే బాధ్యత పాలమూరు బిడ్డ మీద కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిందని, అందుకనే ఈ జిల్లాలో మీరు కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. చస్తే ఇక్కడి మట్టిలో కలిసే వాడనని, అందుకే ఆదరించండి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఆరు గ్యారంటీలను డిసెంబరు 9న అమలు చేస్తామని చెప్పారు. దుబ్బాకలో దాడి చేసింది కాంగ్రెస్ వాళ్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.
దుబ్బాకలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడిని పిరికిపందలా కాంగ్రె్‌సపై నెట్టాలని చూస్తున్నారని, చేతనైతే నిరూపించాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. సోమవారం అంబర్‌పేట, గోల్నాకలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడారు. ‘‘మొండి కత్తితో ప్రభాకర్‌రెడ్డిపై దాడి చేసింది బీజేపీ కార్యకర్త. బీజేపీ, మీరూ ఒక్కటే. ఇద్దరూ కలిసి కాంగ్రె్‌సపై కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాల ప్రచారాలను తిప్పికొడతాం. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్త కత్తితో దాడి చేశాడని సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధం చెబుతున్నారు. ఆ మొండి కత్తితో దాడి చేసింది బీజేపీ వాడు. రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరాడు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి.. సానుభూతి కోసం వాళ్ల అభ్యర్థి మీద మొండి కత్తితో దాడి చేసి కాంగ్రెస్ ఖాతాలో రాయాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి దివాలాకోరుతనం, అబద్ధాలకు ఇది పరాకాష్ఠ. దాడి చేసిన మరుక్షణమే ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారమిస్తారు. దాడి ఎవరు చేశారు..? అందుకు కారణాలేంటి..? వంటి విషయాలను దాచిపెట్టి.. వాళ్లు వాళ్లు నాటకాలాడి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు అని అన్నారు.