కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు. అసలు మంత్రి కేటీఆర్‌కు వ్యవసాయం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. దుడ్లు, బడ్లు, బెడ్లు తప్ప కేటీఆర్‌కు వ్యవసాయం గురించి ఏమి తెలియదని సెటైర్లు వేశారు. కేటీఆర్ ట్విట్టర్ టిల్లు.. నాలెడ్జ్ నిల్లు అని ఎద్దేవా చేశారు. ఇక, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్‌ను ఎక్కడ దొరికితే అక్కడ అడ్డుకోండని రేవంత్ సూచించారు. రైతు వేదికల దగ్గర బీఆర్ఎస్ నేతలను చెట్లకు కట్టేయండని.. హామీలు అమలు చేసేదాకా ఎమ్మెల్యేలను వదలొద్దని రేవంత్ పిలుపునిచ్చారు.
‘రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాను. రాహుల్‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్‌ను ఎక్కడికక్కడ అడ్డుకోండి. విద్యుత్ లడాయి నాకు.. కేటీఆర్‌కే. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ .. ఆయనకి నాలెడ్జ్ నిల్లు. మళ్లీ చెబుతున్నా.. కేటీఆర్‌ని ఎక్కడ దొరికితే అక్కడ అడ్డుకోండి. కేటీఆర్ చెంపలు వాయించండి. 24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపండి. రుణమాఫీ, పోడు భూముల పట్టాలు24 గంటల కరెంటు ఇచ్చే వరకు బీఆరెస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయండి. పుట్టలో ఉన్న పాములు బయటకి వచ్చాయి.. వాళ్ళ పని పట్టాల్సిందే. ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి లాగుల్లో తోండలు వేయండి. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేదాకా ఎమ్మెల్యేలను వదలకండి. అవగాహన లేకే కేటీఆర్ నాపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు. చేసిన దోపీడీని కప్పిపుచుకునేందుకే నాపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ, బీఆరెస్ చీకటి మిత్రులు. వారిద్దరిది ఫెవికాల్ బంధం’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.