ఇటీవల రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక దగ్గర తెల్లవారుజామునే ఇలాంటి ప్రమాద వార్తలు వినాల్సి వస్తుంది. క్షణకాలంలో జరిగిపోతాయి రోడ్డు ప్రమాదాలు. అప్పటివరకు ఓ లెక్క.. ప్రమాదం తర్వాత మరో లెక్క. కాలం వెనక్కి వెళ్తే బాగుండని ప్రతిక్షణం ఆలోచన. చాలా రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమైనప్పటికీ.. ప్రమాద బాధితుల్లో ఎక్కువమంది పేదలు, మధ్యతరగతి వారే ఉంటున్నారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారులలోని హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హయత్ నగర్ లోని వార్డ్ అండ్ డిడి స్కూల్ వద్ద ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది. దీంతో అదుపు తప్పిన బస్సు ఆగి ఉన్న ఓ లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ఏపీలోని జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.