తిరుమల లడ్డూపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై..రోజా సంచలన పోస్ట్ పెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిదని తెలిపారు.
మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నామని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని , కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగిందని చెప్పుకొచ్చారు. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని , తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నానని పేర్కొన్నారు రోజా.