ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య వాతావరణం కాస్త చల్లబడుతుందనుకున్న ప్రతీసారి మిసైల్లు వినాశనం సృష్టిస్తున్నాయి. తాజాగా మూడు వారాల పాటు కాస్తంత నెమ్మదించిన వాతావరణమే కనిపించినప్పటికీ.. మరోసారి క్షిపణుల దాడులతో రష్యా అగ్గి రాజేసింది. ఉక్రెయిన్‌లోని రాజధాని కైవ్, ఖార్కివ్, నల్ల సముద్రం ఓడరేవు ఒడెసాతో సహా పలు నగరాలపై గురువారం రష్యా దాడి చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. భవనాలు, ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులు చేసినట్లు పేర్కొంది. దాదాపు 80 క్షిపణులతో తాజాగా దాడి చేసింది రష్యా.
చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్ పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. రాత్రికి రాత్రే ఆ మిస్సైళ్లను వదిలినట్లు తెలుస్తోంది. తాజాగా మిస్సైల్ అటాక్ లో 9 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తాజా దాడిలో రష్యా 8 డ్రోన్లు కూడా వాడినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. లివివ్ పట్టణంలో అయిదుగురు మృతిచెందారు. భారీ శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. కీవ్‌లోని వెస్ట్రన్, సదరన్ జిల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు ఊపందుకున్నాయి. కీవ్ పట్టణంలో కూడా విద్యుత్తు సరఫరా లేదు.