సాగర్ బైపోల్: టీఆర్ఎస్ రాజకీయం మరో మలుపు తిరిగిందా ?

-

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ రాకముందే స్థానిక రాజకీయం హీటెక్కుతోంది. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికపై రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నోముల కుటుంబానికి టికెట్‌ రాకుండా పావులు కదుపుతున్న ప్రత్యర్ధులు ఒకపక్క మరోపక్క స్థానికత అంశం ఇప్పుడు టీఆర్ఎస్ రాజకీయాన్ని మరో మలుపు తిప్పుతున్నాయి…

సాగర్ ఉపఎన్నికలో అధికార పార్టీ నుంచి అభ్యర్థి ఎవరో తేలకపోయినా.. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉంటారని సంకేతాలు రావడంతో పోరు ఆసక్తిగా ఉంటుందన్నది స్థానికంగా వినిపించే మాట. ఇక్కడ క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేకపోయినా.. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల వల్ల బీజేపీ ఇచ్చే ఫైట్‌ ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత మరోఛాన్స్‌ తీసుకోకూడదని భావిస్తోన్న టీఆర్‌ఎస్‌ ఇక్కడ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలన్నదానిపై తీవ్ర తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలోనే నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

ఉపఎన్నికలో నోముల కుటుంబానికి టికెట్‌ ఇస్తారా లేదా అన్నది ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే నిన్నమొన్నటి వరకు నోముల కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు మరోరకంగా మాట్లాడుతున్నారట. స్థానికులకే ఉపఎన్నికలో టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా స్థానికత అంశాన్ని బలంగా తెరపైకి తీసుకొస్తున్నారట. నోముల నర్సింహయ్య బతికున్న సమయంలో ఆయన పెత్తనాన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్‌లోని కొందరు నాయకులు ఈ వాదనను ప్రచారంలోకి తీసుకొస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అలాంటి నాయకులంతా క్షేత్రస్థాయిలో యాక్టివ్‌ అయినట్టు సమాచారం.

నకిరేకల్‌కు చెందిన నోముల నర్సింహయ్య 2014లో తొలిసారి నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాన్‌ లోకల్‌ నేతకు టికెట్‌ ఇవ్వొద్దని ప్రచారం చేశారు. ఆ వర్గ పోరు కారణంగానే ఆ ఎన్నికల్లో నోముల ఓడిపోయారు. 2018లోనూ అసమ్మతి నేతలు అదే పల్లవి అందుకున్నా.. వారి పప్పులు ఉడకలేదు. మాజీ మంత్రి జానారెడ్డిని ఓడించి ఎమ్మెల్యే కావడంతో నోములను పల్లెత్తు మాట అనలేకపోయారు టీఆర్‌ఎస్‌లో ఆయన్ని వ్యతిరేకించే వర్గం. ఇప్పుడు నోముల అకాల మరణంతో వస్తోన్న ఉపఎన్నికలో స్థానిక నేతలకే టికెట్‌ ఇవ్వాలని కోరడం ద్వారా కలకలం రేపుతున్నారు.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు చాలా మంది స్థానిక టీడీపీ నేతలు ఆసక్తితో ఉన్నారు. తమకున్న పరిచయాల ద్వారా అధిష్ఠానం దగ్గర లాబీయింగ్‌ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పెద్దలు కూడా బలమైన అభ్యర్థి వేటలో ఉన్నారని తెలుసుకున్న కొందరు నాయకులు. తమ అర్థ అంగ బలాన్ని ప్రదర్శించేందుకు వెనకాడటం లేదట. అవకాశం చిక్కితే బలప్రదర్శన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్‌ ఇవ్వొద్దని స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు తీర్మానాలు చేశారు. వారికి సర్ది చెప్పడానికి పెద్ద పెద్ద నేతలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. లోకల్‌ లీడర్స్‌ను బుజ్జగించి.. రామలింగారెడ్డి భార్యకు టికెట్‌ ఇచ్చినా.. అక్కడ ఎన్నికల ప్లాన్‌ వర్కవుట్‌ కాలేదు.

ఇప్పుడు నాగార్జునసాగర్‌లోనూ స్థానికంగా అలాంటి వాతావరణం కల్పించేందుకు కొందరు నాయకులు లోకల్‌.. నాన్‌ లోకల్‌ అంశాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. మరి.. ఈ సమస్యను టీఆర్‌ఎస్‌ పెద్దలు ఎలా అధిగమిస్తారో అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news