టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఢిల్లీ వెళ్లి చంద్రబాబు అనవసర హడావుడి చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారన్న సజ్జల రాజకీయాలనేవి ప్రజల కోసం ఉండాలని తెలిపారు. 2019 వరకు ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని చంద్రబాబే అన్నారన్న విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. గతంలో బీజేపీని తిట్టిన నోటితోనే మళ్లీ పొగుడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందని తెలిపారు.ఇందుకోసమే జేపీ నడ్డాతో చంద్రబాబు వంగి వంగి మాట్లాడారన్నారు.
పొత్తుల కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు. బీజేపీ, టీడీపీ కలవాలనుకుంటే ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. ప్రజలను భ్రమల్లో పెట్టాలనుకునే వారు భ్రమల్లోనే ఉంటారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 175 చోట్ల సొంతంగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పవన్ సపరేట్‌గా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా అంతా చంద్రబాబు ప్లానే అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారని, కానీ అసలు ఆ వ్యతిరేకత ఉందా? అని ప్రశ్నించారు. ఉన్నా ఎంత మేర ఓట్లు చీలుతాయో తెలియాలన్నారు. తమకు మాత్రం 70 శాతం పాజిటివ్ ఓటు ఉందని చెప్పారు. మిగతా 30 శాతాన్ని ప్రతిపక్షాలు పంచుకుంటాయన్నారు.