టీడీపీకి చురకలు అంటిస్తూనే క్లారిటీ ఇచ్చిన సజ్జల

ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతంటూ వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అవసరమని వైసీపీ నేతలు వెల్లడించారు. అప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గుర్తింపులు వస్తాయంటూ వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. ఎక్కడ  కేంద్రం నిధులు ఇచ్చిందని, కేంద్రం నుంచి ఏం తీసుకువచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ.. టీడీపీకి చురకలు అంటిస్తూనే క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలి అన్న ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy rules out early elections in Andhra Pradesh

అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉంటుందన్నారు. రాజ్యాంగపరమైన పదవుల విషయంలో ఏకాభిప్రాయం ఉండాలన్నది మా విధానమని స్పష్టం చేశారు సజ్జల. అందుకే ఎస్టీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి మా పార్టీ మద్దతు ఇచ్చిందని, గతంలో స్పీకర్ గా కోడెల శివప్రసాద్ కి కూడా మద్దతు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై టీడీపీ ఎందుకు ఇంత వరకు తన వైఖరి ప్రకటించటం లేదు.. వెంకయ్యనాయుడు ఉంటేనే మద్దతు ఇచ్చి ఉండేవారా.. యశ్వంత్ సిన్హాకు సపోర్ట్ చేస్తారా..? అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.