ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పాలన చేతకాదని విమర్శించారు. అందుకే బై బై అంటూ చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబు తనకు తానే ఒప్పుకున్నారని వెల్లడించారు. పులివెందులపై చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం అని సజ్జల పేర్కొన్నారు. అటు, ఇప్పటం వ్యవహారంపైనా స్పందించారు. జనసేన సభకు భూమి ఇచ్చినవారిలో ఎవరు ఇల్లు కూలిందో పేర్లు ఇవ్వమంటే పవన్ కల్యాణ్ ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు సజ్జల.
ఇప్పటంలో లేనిదానిపై చంద్రబాబు తదితరులు రచ్చ చేశారని, చివరికి హైకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటం తరహాలోనే ప్రతి దాంట్లోనూ తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని, టీడీపీకి తెలిసిన ఏకైక విద్య ఇదేనని అన్నారు సజ్జల. ఇక, మైలవరం నియోజకవర్గంలో సీనియర్ నేతలు జోగి రమేశ్, వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపైనా స్పందించారు. జోగి రమేశ్, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ మంచి నాయకులే అని, కిందిస్థాయిలో అపోహలు ఉంటే తొలగించుకోవాలని చెప్పాననని వెల్లడించారు సజ్జల.