పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం వాసులందరికీ చేపల్ని పంచారు సర్పంచ్ నాగభూషణం. దీంతో ఊరు ఊరంతా చేపల కూరతో ఘుమఘమలాడింది. బయటవాళ్లకి లీజుకిస్తే చెరువును పాడుచేస్తున్నారని భావించిన సర్పంచ్.. గతేడాది గ్రామంలోని చెరువును బహిరంగ వేలంలో లీజుకు తీసుకున్నారు. ఆ చెరువులో శీలావతి, కట్ల, రూప్‌చంద్, గడ్డిచేపలు వేసి సహజసిద్ధమైన పద్ధతిలో పెంచారు.
చేపలు బాగా పెరగడంతో, వాటిని వలలు వేసి పట్టించారు. సర్పంచ్ నాగభూషణం ఆ చేపలను తమ గ్రామ ప్రజలకు ఫ్రీగా పంపిణీ చేశారు. కొందరికైతే ఇళ్లకు వెళ్లి మరీ చేపలను అందించారు. దాంతో గొల్లగూడెం గ్రామ ప్రజలు ఆరోగ్యవంతమైన తాజా చేపలను వండుకుని తిన్నారు. అంత మంచి చేపలను తమకు ఉచితంగా ఇచ్చిన సర్పంచ్ నాగభూషణంకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ నాగభూషణం ఇలా చేపలను ఉచితంగా పంచడం ఇదే మొదటిసారి కాదు. ఆయన గతేడాది కూడా ఇలాగే చేపలను ఉచితంగా పంపిణీ చేశారు.