సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నీ వర్గాల ప్రజలే కాదు..దేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉన్న నియోజకవర్గం..ఇక్కడ ప్రజా తీర్పు ఎక్కువసార్లు టీడీపీకి అనుకూలంగానే వచ్చింది..అది కూడా జి. సాయన్న వైపే ప్రజలు నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి పట్టు దొరికింది. 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో కంటోన్మెంట్ లో టిడిపి గెలిచింది ఇందులో నాలుగుసార్లు సాయన్న టిడిపి నుంచే గెలిచారు.
కానీ 2014 లో టిడిపి నుంచి గెలిచిన తర్వాత..తెలంగాణలో ఆ పార్టీకి పట్టు తగ్గిపోతున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఇక 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచారు. అలా అయిదుసార్లు కంటోన్మెంట్ నుంచి సాయన్న గెలిచారు. అంటే అక్కడి ప్రజలు సాయన్నకు మద్ధతుగా ఉన్నారని అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు సాయన్న లేరు..ఇటీవలే ఆయన అనారోగ్యంతో మరణించారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఉపఎన్నికలు రాలేదు.
అయితే నెక్స్ట్ కంటోన్మెంట్ లో రసవత్తరమైన పోరు జరగనుంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపిల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఇక బిఆర్‌ఎస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది సస్పెన్స్ గా మారింది. సాయన్నకు పట్టుంది కాబట్టి..ఆయన కుమార్తెకు కంటోన్మెంట్ సీటు ఇవ్వాలని కొందరు బిఆర్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అటు యువనేత క్రిశాంక్ సైతం కంటోన్మెంట్ సీటు కోసం ట్రై చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు కూడా సీటు ఆశిస్తున్నారు.
అటు కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ ఉన్నారు…ఆయనకు పెద్ద పాజిటివ్ లేదు. ఇటు బిజేపి నుంచి గణేశ్ ఉన్నారు. కానీ అక్కడ సీటు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు అక్కడ మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. ఒకవేళ సాయన్న కుమార్తెకు సీటు ఇవ్వకపోతే..అక్కడ సాయన్న వర్గం బిఆర్‌ఎస్ పార్టీకి సహకరించే ఛాన్స్ ఉండకపోవచ్చు. దీంతో ఆ పార్టీకి కాస్త ఇబ్బంది. చూడాలి మరి ఈ సారి కంటోన్మెంట్ ఎవరికి దక్కుతుందో.