సీమలో రక్త చరిత్ర మళ్లీ మొదలైందా

-

రాయలసీమ అంటే ఫ్యాక్షన్ హత్యలకు అడ్డా అని.. మరోసారి రుజువైనట్లు కనిపిస్తోంది.తాడిపత్రిలో ఘర్షణ, ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ బీసీ నేత హత్యతో.. రాజకీయ నాయకుల పోకడలను ఎదిరించిన వారిని… అంతమొందించే సంస్కృతి జిల్లాలో మళ్లీ మొదలైందా అనే అనుమానం కలుగుతోంది.

కడపజిల్లాలో జరిగిన టీడీపీ నేత హత్య.. కలకలం రేపింది. టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు సమీపంలోని.. సోములవారిపల్లె పొలాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఅవుట్ దగ్గర విగతజీవిగా పడిఉన్నాడు సుబ్బయ్య. ఆయనను.. కళ్లల్లో కారం కొట్టి కత్తులతో నరికి చంపారు ప్రత్యర్థులు.

ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన నందం సుబ్బయ్య… 2002 నుంచి ఏడేళ్ల పాటు ప్రొద్దుటూరు ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. 2009లో రాచమల్లు వైసీపీలో చేరగా.. సుబ్బయ్య మాత్రం టీడీపీలోనే ఉండిపోయాడు. 2015 నుంచి కడపజిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న సుబ్బయ్య.. మొన్నటి వరకూ ఎవరి మీదా ఆరోపణలు చేయలేదు. ఒక్కసారిగా అధికార పక్షం ఎమ్మెల్యేతో పాటు ఆయన బావమరిది బంగారు రెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అందువల్లే.. ఆయనను ప్రత్యర్థులు చంపేసి ఉంటారన్న అనుమానం కలుగుతోంది.

ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణాపై సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారు సుబ్బయ్య. ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యే బావమరిది హస్తం ఉందని ఆరోపిస్తూ.. ఒక వీడియో కూడా రిలీజ్‌ చేశారు. ఇళ్ల పట్టాల వ్యవహారంలో కూడా భారీ అవకతవకలు జరిగాయంటూ.. సోమవారం ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఆరోపణలు చేసిన సుబ్బయ్య.. మరుసటి రోజే హత్యకు గురికావడం.. అనుమానాలకు తావిస్తోంది. సుబ్బయ్య కుటుంబసభ్యులు సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు.

సుబ్బయ్య హత్య వెనుక ఎమ్మెల్య రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అతని బావమరిది బంగారు మునిరెడ్డిల ప్రమేయం ఉందని.. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపిస్తున్నారు. సుబ్బయ్యను చంపిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు.సుబ్బయ్యను హత్య చేసిన వారికోసం వేట ప్రారంభించారు పోలీసులు. సోషల్ మీడియా సుబ్బయ్య పోస్టుకు ప్రతి వ్యాఖ్యలు చేసిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news