ఆగండి ఆగండి కంగారు పడకండి… గుర్రానికి సోకలేదు… గుర్రానికి కరోనా బొమ్మలు వేసారు ఏపీ పోలీసులు. జనాలకు కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం కావడం లేదు. దీనితో వారికి కరోనా వైరస్ గురించి అవగాహన మరింతగా కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇప్పుడు ఏపీ పోలీసులు కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాలని భావించారు.
కర్నూలు జిల్లా పోలీసులు గుర్రానికి రంగులు వేసారు. ఎరుపు రంగులో గుర్రానికి పెయింటింగ్ వేసారు. దాన్ని పోలీసులు వీధుల్లో తిప్పి కరోనా గురించి అందరూ మాట్లాడుకునే విధంగా చేసారు. కరోనా వైరస్ ప్రమాదకరమని దయచేసి ఎవరూ కూడా బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ గుర్రాన్ని చూసి ముందు కర్నూలు ప్రజలు షాక్ అయ్యారు. కరోనా వైరస్ గురించి అంతా మాట్లాడుకున్నారు.
ఈ గుర్రాన్ని దాదాపు మూడు గంటల పాటు వీధుల్లో తిప్పారు అధికారులు. దీనిని మరో రెండు రోజులు కొనసాగించాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత ఏపీ లో కట్టడిలోనే ఉంది. 23 మందికి కరోనా వైరస్ సోకింది. విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కరోనా కేసులు బయటపడ్డాయి. దీనితో అధికారులు ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను బయటకు రాకుండా లాక్ డౌన్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.