రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు మరియు మెజారిటీ మెయిటీ కమ్యూనిటీకి మధ్య ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్ గవర్నర్ గురువారం రాష్ట్ర హోం శాఖ యొక్క షూట్-ఎట్-సైట్ ఆర్డర్‌ను ఆమోదించారు. మే 3, బుధవారం గిరిజన సంఘీభావ యాత్రలో హింసాత్మక సంఘటనలు నమోదవడంతో ప్రస్తుత శాంతి భద్రతల దృష్ట్యా ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. మరోవైపు ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఇప్పటికే అనేక వాహనాలను తగులబెట్టారు. ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్, ఇంఫాల్ నగరాల్లో హింసాకాండ పెచ్చుమీరింది. మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తోంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దీంతో హింస ప్రజ్వరిల్లిందని తెలిపింది. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ, ఇంఫాల్, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారని తెలిపారు.