‘మా’ అధ్యక్షుడు అయ్యాక మంచు విష్ణు ఒక ప్రాజెక్టు ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ ను శుక్రవారం ఉదయం చిత్రబృందం ప్రకటించింది. ‘జిన్నా’ అని ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసింది. అయితే జిన్నా ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి ముందు ఏం జరిగిందో తెలియజేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేసింది టీమ్.
ఈ వీడియోలో మంచి స్క్రిప్టు దొరికితే సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్న తరుణంలో సునీల్ సలహామేరకు తన కెరీర్ లోనే హిట్ చిత్రాలుగా చెప్పుకునే ‘డీ’, ‘దేనికైనా రెడీ’ సినిమాలకు కథలు అందించిన కోన వెంకట్ కు ఆయన ఫోన్ చేస్తారు. కోనని కథ అడగ్గా.. మీరు ‘మా’ ప్రెసిడెంట్ కదా.. సినిమాలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించగా..’మా’ ప్రెసిడెంట్ అయితే సినిమాల్లో నటించకూడదా? ఒక సినిమా చేస్తే వంద మందికి పని వస్తుంది.ఆ వంద మందిలో నేను కూడా ఒకడిని అవుతా.. అని విష్ణు సమాధానమిస్తాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.