శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మిదేవి వ్రతం ఇలా శ్రావణ మాసంలో చాలా పూజలు ఉంటాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి 12 నెలలు ఉంటాయి. వాటిలో ఐదవ మాసం శ్రావణ మాసం. ఈ నెలలో ప్రత్యేక పూజలు చేయడం నోములు చేసుకోవడం వంటివి మహిళలు చేస్తూ ఉంటారు. కేవలం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో మాత్రమే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కూడా శ్రావణ మాసంలో పూజలు చేస్తూ ఉంటారు.
శ్రావణ మాసం ఈసారి ఆగస్టు 9 అంటే ఈ రోజు నుండి మొదలు అయింది. సెప్టెంబరు 7 వరకు శ్రావణమాసం ఉంటుంది. ఉపవాసం మొదలు పూజలు వరకు భక్తి శ్రద్ధలతో మహిళలు చేసి తమ ఇష్టదైవాన్ని కొలుస్తారు. అలానే చాలా మంది ఇళ్లల్లో ఈ నెలంతా కూడా మాంసం ముట్టుకోరు.
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పై అలిగి వైకుంఠం వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. అందుకని ఈ మాసంలో భక్తులు ఉపవాస దీక్ష లో పాల్గొని స్వామి వారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అలా వెళ్లిపోయిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల కడలి నుండి ఆవిర్భవించినట్లు చెబుతూ ఉంటారు. అయితే అమ్మ వారి కంటే ముందుగా సముద్రం నుండి విషం బయటికి వచ్చినప్పుడు ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడు అని అంటారు. దీని కారణంగా ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి పెద్దఎత్తున పూజలు చేస్తారు. శ్రావణమాసంలో ప్రత్యేకంగా పూజలు చేసి నోములు చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం.