తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయబోయే… 80,039 ఉద్యోగాల్లో ఉన్న నీటి పారుదల, రహదారులు – భవనాలు, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి పారుదల తో పాటు ప్రజ ఆరోగ్య శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా కసరత్తులను కూడా ప్రారంభించింది.
ఈ ఐదు శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించడం వల్ల సమయం వృథా అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఇలా చేయడం వల్ల కొన్ని శాఖల్లో ఉద్యోగాలు కూడా మిగిలిపోయే అవకాశం ఉందని ప్రభుత్వానికి అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఐదు శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించాలని చూస్తుంది. ఇలా చేయడం వల్ల దరఖాస్తు దారులకు, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇలా పరీక్ష నిర్వహించడానికి సాధ్యా సాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాగ ఈ ఐదు శాఖల ద్వారా దాదాపు 2,000కు పైగా ఇంజినీరింగ్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.