‘ఓ సీతా.. వదలనిక తోడౌతా’ అంటూ ఇటీవలే వచ్చిన ‘సీతారామం’లో సాంగ్ సహా ఆ మూవీ ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రేమ కావ్యానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. హీరోహీరోయిన్ కెమిస్ట్రీ వీక్షకుల మనసుల్ని తాకుతోంది. అయితే ముఖ్యంగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర పేరుకు(సీత) కూడా బాగా కనెక్ట్ అయిపోతున్నారని తెలుస్తోంది.
అసలు విషయమేమిటంటే.. కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో చాలా నేచురల్‌గానూ కనిపిస్తుంటాయి. ఓ సినిమాపై ఆసక్తి పెంచడానికి టైటిల్ ఎంత ముఖ్యమో.. సినిమా చూస్తున్నంత సేపు కథకు అందులోని పాత్రలకు మనల్ని మరింత దగ్గర చేసేందుకు.. పాత్రకు తగ్గ పేరు కూడా అంతే అవసరం. అందుకే నటీనటులకు తమ రోల్స్‌కు తగ్గట్టుగా పేర్లను పెడుతుంటారు దర్శకులు. అందులో కొన్ని పేర్లకు తెలియకుండానే మనం కనెక్ట్ అయిపోతుంటాం. మనసును హత్తుకుంటాయి. అలాంటి కోవాకే చెందినది ఈ సీత పేరు కూడా. తాజాగా విడుదలైన ‘సీతారామం’ సినిమాలోనూ హీరోయిన్ పాత్ర సీత పేరుకు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అలా కనెక్ట్ అయిపోయినవారు.. సోషల్‌మీడియా వేదికగా సీత పేరుతో ఉన్న పాత్రలను గుర్తుచేసుకుంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆ మీమ్స్‌ను గమనిస్తే ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. ఆ పేరుతో ఉన్న పాత్రకు సంబంధించిన సినిమాలను పరిశీలిస్తే అవన్నీ హిట్ కావడం మరింత విశేషం. ఓ సారి ఆ సినిమాలేంటో చూసేద్దాం..
‘గోదావరి’.. సుమంత్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన చిత్రం ‘గోదావరి’. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథానాయికగా కమలినీ ముఖర్జీ నటించింది. ఆమె పాత్ర పేరు కూడా సీతనే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సుమంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. కాగా, మే 19, 2006లో విడుదలైన ఈ సినిమాని అమిగోస్ క్రియేషన్స్, కాడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి నిర్మించగా జీవీజీ రాజు నిర్మాత .
‘కంచె’.. జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కంచె’. ఇందులో వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటీనటులుగా నటించారు. సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర పేరు కూడా సీత కావడం విశేషం. ఈ సినిమా.. సామాజిక అంశాలతో, సమాజాన్ని మేల్కొల్పుతూ తెరకెక్కింది. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా చేసింది. తొలి సినిమా ముకుందతో ఫ్లాప్ అందుకున్న వరుణ్‌కు హీరోగా నిలబడటానికి బలంగా నిలిచింది.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. 2013లో విడుదలై మంచి హిట్ సొంతం చేసుకున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇందులో వెంకటేష్, మహేశ్ బాబు, సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్, జయసుధ నటించారు. అయితే అంజలి పాత్ర(సీత) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ పేరుకు తగ్గట్టే అంజలి అద్భుతంగా నటించి అభిమానుల మనసు దోచింది.
‘సోగ్గాడే చిన్నినాయన’.. 2016లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ఈ మూవీ పండగ పూట విడుదలై ప్రేక్షకులకు పిండి వంటకాల రుచులన్నీ చూపించేసింది. ఇందులో నాగ్ ద్విపాత్రాభినయం చేశారు. కొడుకు పాత్రలో ఉన్న నాగ్‌కు జోడీగా నటించిన లావణ్య త్రిపాఠి సీతగా నటించి అభిమానులను అలరించింది. రమక్యష్ణ కూడా కీలక పాత్ర పోషించారు.
‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. 2015లో హరీష్ శంకర్ దర్శకత్వం విడుదలైన ఈ చిత్రం సాయితేజ్ కెరీర్లో మంచి సక్సెస్ అయింది. అదా శర్మ, బ్రహ్మానందం, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో హీరోయిన్గా రెజీనా సీతగా నటించి ఆకట్టుకుంది.
ఇక ‘సీతారామం’ విషయం గురించి తెలిసిందే.. హను రాఘవపూడి దర్శకత్వంలో తాజాగా విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. దుల్కర్ సల్మాన్, రష్మిక, మృణాళిని ఠాకూర్, అక్కినేని నటుడు సుమంత్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మృణాళిని సీత పేరుకు తగ్గటు అందంగా కనిపించి ప్రేక్షకుల మనసు దోచేసింది.