భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతన్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. నిన్నటి రోజున కార్యకర్తలు, నేతల్లో జోష్ పెంచేందుకు రాహుల్ గాంధీ పరుగు పందెం పెట్టి పరుగులు తీశారు. రాహుల్ గాంధీతో పాటు నేతలు, కార్యకర్తలు కూడా పరుగులు తీశారు. కాగా, నేడు ఆరో రోజు షాద్ నగర్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. షాద్ నగర్ నుంచి ముచ్చింతల్ దగ్గర ఉన్న పెద్దషాపూర్ వరకు యాత్ర కొనసాగనున్నది. కొత్తూరులో ఈరోజు మధ్యాహ్నం రాహుల్ గాంధీ భోజనం చేయనున్నారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి యాత్రను ప్రారంభించి ముచ్చింతల్‌కు చేరుకుంటారు. ముచ్చింతల్ దగ్గర రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. అనంతరం రాత్రికి శంషాబాద్ శివారులో ఉన్న తుండుపల్లి వద్ద రాహుల్ గాంధీ బస చేయనున్నారు. తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు స్పందన లభిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ పాదయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభం కాగానే మరింత జోష్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. అయితే.. రేపు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. ఈ పాదయాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు.