జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ నేపత్యంలో జాతీయ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే తాజాగా ఆయన టూర్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ధి పర్యటన వాయిదాసీఎం కేసీఆర్ చేపట్టిన దేశవ్యాప్త పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. జాతీయస్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలువురు నేతలను కలిసే కార్యక్రమం చేపట్టిన సీఎం.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(మే 27వ తేదీన) రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కేసీఆర్ భేటీ కావాల్సి ఉండగా.. పర్యటన వాయిదా పడింది.
బెంగళూరు నుంచి నేరుగా కేసీఆర్ రాలేగావ్ సిద్ధికి వెళ్లాల్సి ఉండగా.. ఆయన అక్కణ్నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు.ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం.. రాలేగావ్ సిద్ధి పర్యటన అనంతరం షిర్డీని సందర్శించి.. మే 29 లేదా 30వ తేదీన బంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లాల్సి ఉండేది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శించేందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం చోటుచేసుకున్న మార్పుతో.. మిగతా పర్యటన షెడ్యూల్లోనూ మార్పులు జరగనున్నట్టు సమాచారం.