సిక్కింలో కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు . వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో పెంగాంగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో లెచెన్, లచుంగ్ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 2000 మంది పర్యాటకులను సురక్షితంగా తరలించారు. త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రాత్రంతా పనిచేసి, పర్యాటకుల రక్షణ, సౌకర్యార్థం ఫ్లాష్ వరద ప్రాంతంపై తాత్కాలిక క్రాసింగ్‌ను నిర్మించారు. పర్యాటకులు నదిని దాటడానికి సహాయం చేసారు. ఆహారం, గుడారాలు, వైద్య సహాయం అందించారు. శనివారం మధ్యాహ్నం వరకు మరో 1500 మంది పర్యాటకులను రక్షించేందుకు తరలిస్తున్నట్లు పీఆర్వో మహేంద్ర రావత్ తెలిపారు. రోడ్డు కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా, కొండచరియలు విరిగిపడినా రెండు బస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 72 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సిక్కిం పోలీసులు తెలిపారు. 19 మంది పురుషులు, 15 మంది మహిళలు, 4 మంది చిన్నారులతో గ్యాంగ్‌టక్‌కు వెళ్తున్న తొలి బస్సుపై మంగన్ జిల్లాలోని పెగాంగ్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.