టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ… వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారుల, టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్లు మాకు అనుమానంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా కాకుండా వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పెగాసెస్ స్పైవేర్ టీడీపీ కొనుగోలు చేశారనేది పెద్ద బ్లండర్ అని ఆయన కొట్టిపారేశారు. దేశాల మధ్య రహస్యాలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్ వేర్ రూపొందించారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాఫ్ట వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదని అన్నారు. మమతా బెనర్జీకి పెగాసెస్ మీద అవగాహన లేకుండా ఉండవచ్చని.. పీకేలు, కేకేల వంటి వారు మమతా బెనర్జీతో అలా మాట్లాడించి ఉండవచ్చని ఆయన అన్నారు. పెగాసెన్ స్పై వేర్ ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే వివేకా హత్య జరిగే అవకాశమే ఉండేది కాదని… కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా ఈ స్పై వేర్ కొనుగోలు చేసే అవకాశమే లేదని అన్నారు. మోదీ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు, లోకేష్ లను పీకే వ్యూహాలతో ఇమేజ్ డ్యామేజ్ చేశారని.. కోడి కత్తి కేసు, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కాలుకు కట్టు కట్టుకట్టించి రాజకీయం చేసింది పీకే అని ఆరోపించారు.