నేను అబ్బాయినైతే కథ వేరేలా ఉండేది : సెరెనా విలియమ్స్

-

‘నేనుగనుక ఒక అబ్బాయి అయితే.. ఇప్పుడే రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం వచ్చేది కాదు. నా భార్య పిల్లల్ని కనేందుకు శారీరక శ్రమకు గురవుతుంటే.. నేను ఆటపై దృష్టి పెట్టి విజయాలు సొంతం చేసుకునేదాన్ని. టామ్‌ బ్రాడీ కంటే ఎక్కువ ఆడేదాన్ని. రిటైర్మెంట్‌ అన్న పదమే నాకు నచ్చదు’ అంటూ తన వీడ్కోలు గురించి ఆవేదనగా చెప్పింది సెరెనా విలియమ్స్.

గెలుపే లక్ష్యంగా టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన అమెరికా టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌.. 23 గ్రాండ్‌ స్లామ్‌లను తన ఖాతాలో వేసుకుంది. అలా గెలుస్తూనే.. స్టెఫీగ్రాప్‌, క్రిస్‌ ఎవర్ట్‌, మార్టినా నవ్రతిలోవా వంటి దిగ్గజాలను అధిగమించింది. 2017లో రెండు నెలల గర్భిణిగా ఆస్ట్రేలియా ఓపెన్‌ను దక్కించుకుంది. అది ఆమెకు 23వ టైటిల్‌. క్లిష్టతరమైన కాన్పు తర్వాత నుంచి మునుపటిలా సత్తా చాటి.. మార్గరెట్‌ కోర్టు (24 టైటిళ్లు)ను దాటేందుకు ప్రయత్నించి అడుగుదూరంలోనే మిగిలిపోయింది.

ఈ సమయంలో ఆమె కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిరావడంతో.. ఈ 41 ఏళ్ల దిగ్గజం ఆటకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమైంది. మంగళవారం వోగ్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కవర్‌ స్టోరీలో ద్వారా ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం తన రిటైర్మెంట్‌ గురించి ఆమె కచ్చితమైన సమయమేమీ చెప్పలేదు. యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొంటున్నట్లు మాత్రం వెల్లడించింది.

‘దురదృష్టవశాత్తూ ఈ ఏడాది వింబుల్డన్‌ గెలవలేకపోయాను. అలాగే న్యూయార్క్‌లో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానో లేదో నాకు తెలీదు. కానీ నేను నా వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నాను’ అని అన్నారు. ఈ నెల చివర్లో న్యూయార్క్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇటీవల జరిగిన వింబుల్డన్‌ టోర్నీలో ఆమెకు తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది. అన్‌ సీడెడ్ ప్లేయర్ చేతిలో ఓటమి చవిచూసింది.

Read more RELATED
Recommended to you

Latest news