బెంగళూరు, హైదరాబాద్‌ మ్యాచ్‌ను విజయ్‌మాల్యా ఫిక్స్‌ చేశాడా ? ఫ్యాన్స్‌ ట్వీట్లు..!

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య తాజాగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓ దశలో హైదరాబాద్‌ గెలుస్తుందని అంతా భావించారు. చేతిలో వికెట్లు ఉన్నాయి. అందుకోవాల్సిన లక్ష్యం కూడా తక్కువే. అయినప్పటికీ హైదరాబాద్‌ ఓడిపోవడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీని వెనుక విజయ్‌ మాల్యా హస్తం ఉండి ఉంటుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

mallya fixed bengaluru hyderabad match fans tweets

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓ దశలో లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లే కనిపించింది. కానీ బెంగళూరు బౌలర్‌ షాబాజ్‌ అహ్మద్‌ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. దీంతో హైదరాబాద్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. తరువాత లక్ష్య ఛేదనలో వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే విజయ్‌ మాల్యా ఈ మ్యాచ్‌ను ఫిక్స్‌ చేసి ఉంటాడని, అందుకనే హైదరాబాద్‌ ఓడి ఉంటుందని, లేకపోతే అంత తక్కువ లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లుగా అనిపించిన జట్టు సడెన్‌గా వికెట్లను కోల్పోయి మ్యాచ్‌లో ఓడిపోవడం ఏమిటి ? అని ఫ్యాన్స్‌ ట్వీట్లు చేస్తున్నారు.

అంతా బాగానే ఉన్న దశలో సడెన్‌గా వికెట్లను కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తుందని హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే వారు విజయ్‌మాల్యా ఈ మ్యాచ్‌ను ఫిక్స్‌ చేసి ఉంటాడని అనేక ట్వీట్లు చేస్తున్నారు. అవి వైరల్‌ అవుతున్నాయి. అయితే విజయ్‌ మాల్యా ఆర్‌సీబీని వదిలేసి ఎంతో కాలమైంది. దేశంలోని 17 బ్యాంకులకు అతను రూ.9వేల కోట్లకు టోపీ పెట్టి లండన్‌లో తిరుగుతున్నాడు. అతన్ని భారత్‌కు రప్పించేందుకు అధికారులు శతవిధాలా యత్నిస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. కానీ మాల్యా పేరు ఈ విధంగా మరోమారు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.