భార‌త్ గెలుపుతో ఖంగు తిన్న లంక జ‌ట్టు.. కెప్టెన్‌పై కోచ్ మిక్కీ ఆర్థ‌ర్ ఆగ్ర‌హం.. వీడియో..!

భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య కొలంబోలో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ అద్భుతమైన విజ‌యం ( India Won ) సాధించిన విష‌యం విదిత‌మే. 7 వికెట్లు కోల్పోయి దాదాపుగా ఓట‌మి అంచున ఉన్న భార‌త్‌ను దీప‌క్ చాహ‌ర్ త‌న అద్భుత‌మైన బ్యాటింగ్ తో గెలిపించాడు. జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. దీంతో 3 వ‌న్డేల సిరీస్‌ను భార‌త్ 2-0తో కైవ‌సం చేసుకుంది. అయితే గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్న లంక జ‌ట్టుపై ఆ జ‌ట్టు కోచ్ మిక్కీ ఆర్థ‌ర్ మండిప‌డ్డాడు. మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌తో ఆర్థ‌ర్ వాగ్వివాదానికి దిగాడు.

భార‌త్ గెలుపు | India Won
భార‌త్ గెలుపు | India Won

ఆర్థ‌ర్‌, శ‌న‌క‌లు వాదించుకునే దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. 7 వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచున ఉన్న భార‌త్ ఎలా గెలించింద‌ని లంక జ‌ట్టు ఇప్ప‌టికీ షాక్‌లో ఉంది. దాదాపుగా విజ‌యం ఖాయ‌మైంద‌ని అనుకున్న త‌రుణంలో లంక జ‌ట్టు ఓట‌మి పాల‌వ‌డం కోచ్‌కు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. దీంతో ఆర్థ‌ర్ లంక కెప్టెన్ శ‌న‌క‌తో కాసేపు గొడ‌వ ప‌డ్డంత ప‌నిచేశాడు.

కాగా మ్యాచ్ ముగింపు ద‌శ‌లోనూ ఆర్థ‌ర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి లంక జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు ప‌దే ప‌దే సైగ‌లు చేశాడు. అనేక సార్లు సందేశాలు పంపాడు. అయిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఓట‌మి పాలైంది. అయితే శ‌న‌కతో వాదించిన అనంత‌రం ఆర్థ‌ర్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై లంక జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ ర‌స్సెల్ ఆర్నాల్డ్ స్పందించాడు. ఆ వాద‌న స‌రైందేన‌ని, కాక‌పోతే అంద‌రూ చూస్తుండ‌గా గ్రౌండ్‌లో కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో వాదించుకుని ఉండాల్సింద‌ని, ఇది జ‌ట్టుకు మంచిది కాద‌ని ఆర్నాల్డ్ ట్వీట్ చేశాడు. అస‌లే సంక్షోభంలో ఉన్న లంక జ‌ట్టుకు ఇది పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా మారింది. మ‌రి చివ‌రి మ్యాచ్‌లోనైనా లంక విజ‌యం సాధిస్తుందా, లేదా అన్న‌ది చూడాలి.