క్రికెట్ ప్రపంచంలో పసికూన.. మేటి జట్టుపై విజృంభించి ఆడుతున్న వేళ.. మ్యాచ్ చేజారిపోతుందని.. చిన్న జట్టు చేతిలో ఓటమి పరాభవం తప్పదేమోనని సగటు భారత అభిమాని విచారంతో ఉన్న సమయంలో.. సరిగ్గా అప్పుడే.. భారత బౌలర్ మహమ్మద్ షమీ వరుసగా సంధించిన 3 బంతులకు.. 3 ఆఫ్గనిస్థాన్ వికెట్లు టప టపా కూలాయి. అంతే.. విజయం భారత్ వశమైంది. ఇవాళ జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌పై భారత్ 11 పరుగుల తేడాతో గెలుపొందగా.. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
సౌతాంప్టన్‌లో ఇవాళ ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా కెప్టెన్ కోహ్లి (63 బంతుల్లో 67 పరుగులు, 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (68 బంతుల్లో 52 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆకట్టుకు ప్రదర్శన చేయలేదు. ఇక ఆఫ్గన్ బౌలర్లలో గుల్బదీన్ నయీబ్, మహమ్మద్ నబీలు చెరో 2 వికెట్లు తీయగా, ముజీబ్ ఉర్ రహమాన్, ఆఫ్తాబ్ ఆలం, రషీద్ ఖాన్, రహ్మత్ షాలు తలా 1 వికెట్ తీశారు.
తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గనిస్థాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఒక దశలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. దీంతో అందరూ టీమిండియా ఓటమి ఖాయమనుకున్నారు. కానీ భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో ఆఫ్గనిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఆఫ్గనిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో మహమ్మద్ నబీ (55 బంతుల్లో 52 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒక్కడే ఆకట్టుకునే ప్రదర్శన చేయగా, అటు భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు దక్కాయి. అలాగే బుమ్రా, చాహల్, పాండ్యాలకు తలా 2 వికెట్లు దక్కాయి.