భారత్(INDIA), శ్రీలంక జట్ల మధ్య వన్డే, టీ 20 సిరీస్ మ్యాచ్ టైమింగ్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. జులై 18 నుంచి జరగాల్సిన వన్డే మ్యాచ్‌లు అరగంట ఆలస్యంగా మొదలవనున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అలానే జులై 25 నుంచి ప్రారంభమయ్యే టీ20 మ్యాచ్‌లు సైతం గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. గత షెడ్యూల్ ప్రకారం వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇపుడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇక సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన టీ20లు రాత్రి 8 గంటలకు మొదలవనున్నాయి.
కాగా భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ జులై 13 నుంచి ప్రారంభం కావల్సి ఉండగా… శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడడంతో లంక క్రికెట్ బోర్డు సిరీస్ ను రీషెడ్యూల్ చేసిన విషయం తెల్సిందే. జులై 18వ తేదీన మొదటి వన్డే, 20వ తేదీన రెండో వన్డే, 23వ తేదీన మూడో వన్డే జరుగనుంది. అలానే జులై 25, 27, 29 తేదీల్లో వరుసగా మూడు టీ20లు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జులై 13, 16, 18 తేదీల్లో వన్డేలు, 21, 23, 25 తేదీల్లో టీ20లు జరగాల్సి ఉంది.