గత రాత్రి బెంగళూర్ మరియు చెన్నై జట్ల మధ్య జరిగిన భారీ స్కోరు మ్యాచ్ లో ఇరు జట్లు చివరి వరకు విజయం కోసం ఒక లెవెల్ లో పోటీ పడ్డాయి. చివరకు అనుభవం ముందు RCB ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ పిచ్ ను సమర్థవంతంగా వాడుకుని నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఈ టార్గెట్ ను RCB చేధిస్తుందా లేదా అన్న అనుమానంతో బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూర్ కు మొదటి ఓవర్ లోనే బిగ్ షాక్ తగిలింది… కోహ్లీ కేవలం ఆరు పరుగులకే ఆకాష్ సింగ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత వెంటనే లొమ్రార్ రూపంలో మరి వికెట్ పడి బెంగళూర్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో డుప్లిసిస్ కు జత కలిసిన మాక్స్ వెల్ దాదాపు మ్యాచ్ ను గెలిపించినంత పని చేశారు. కానీ చివర్లో భారీ షాట్ లకు ప్రయత్నించి ముందుగా మాక్స్ వెల్ ఆ తర్వాత డుప్లిసిస్ ఔట్ అవ్వడంతో RCB విజయానికి బ్రేకులు పడ్డాయి. అనంతరం దినేష్ కార్తిక్ RCB ను రేస్ లో ఉంచినా అతడు కూడా కీలక సమయంలో ఔట్ అవ్వడంతో మ్యాచ్ చెన్నై వైపుకు మొగ్గింది. షాహబాజ్ అహ్మద్ మరియు పార్నల్ లు సరిగా ఆడి ఉంటే గెలుపు దక్కేది. కానీ వీరి వైఫల్యం మరియు ధోనీ కెప్టెన్సీ అనుభవం ముందు RCB ఓటమి తప్పలేదు.