బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. 12 డిమాండ్ల సాధనే లక్ష్యంగా.. నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే రెగ్యూలర్ వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ న్యాక్ హోదాలో వెనకబడిపోయిందని, తమ గోడును వినే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన శాంతియుత నిరసన 4 గంటలపాటు కొనసాగింది. విద్యార్థులు టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ నిరాహార దీక్షకు ప్రతిరోజు ఆరు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.
విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో.. తల్లిదండ్రులు భారీగా బాసర ట్రిపుల్ ఐటీకి మోహరించారు. దీంతో తల్లిదండ్రులకు అనుమతి లేదని ట్రిపుల్ ఐటీ సిబ్బంది అడ్డుకోంది. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. ఈ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని, సీఎం కేసీఆర్ ఆర్జీయూకేటీని సందర్శించాలని డిమాండ్ చేశారు. అలాగే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని పేర్కొన్నారు. కాలేజీకి వీసీ లేక సరైన విద్య అందడం లేదన్నారు. దీంతో న్యాక్‌లో బాసర ఆర్జీకేయూటీ సీ గ్రేడ్ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు రావాలని, తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన ఆగదన్నారు.