బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత వారం, పది రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా విద్యార్థులతో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి.. 12.30 ప్రాంతంలో తమ ఆందోళన విరమించారు. నేటి నుంచి తరగతులకు హాజరవుతామని విద్యార్థులు ప్రకటించారు. చర్చల అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ బయలు దేరి వెళ్లారు.
రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకు పైగా ఈ చర్చలు జరిగాయి. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 12 డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబితా హామీ ఇచ్చారని విద్యార్థులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. తమ ఆందోళనలు విరమిస్తున్నట్లు చెప్పారు స్టూడెంట్స్.