ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. గుంటూరు బ్రాడీపేట 4వ లైన్ లో సుచరిత ఇంటి సమీపంలో ఉన్న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్ లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.