ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధమవుతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు క్రాప్ హాలీడే పేరుతో ఆందోళన చేస్తున్నారు. సాధారణ రైతులతోపాటు ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.కోట్లు ఆదాయం తెచ్చిపెట్టే ఆక్వా పరిశ్రమలో హాలీడే ప్రకటించకముందే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ధరల పెరుగుదలతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిపోయింది. ఆక్వా రైతులు వ్యాపారం చేయడానికి భయపడుతున్నారని నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆక్వారంగం సంక్షోభం బారిన పడకుండా చూడాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇసుక పాలసీ మార్చడంతో భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో.. రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని నారా లోకేశ్ కోరారు.