రుషికొండ చుట్టూ చేపడుతున్న టూరిజం పనులకు సంబంధించి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైఎస్సార్సీపీ వర్గాలు ఆనంద వ్యక్తం చేస్తున్నాయి.ఈ కేసులో వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఎదురుదెబ్బ తగిలింది.ఇప్పటిదాకా చేపడుతున్న పనులను కొనసాగించవచ్చని అలానే కేసును హై కోర్టుకు ట్రాన్ఫర్ చేస్తూ తదుపరి వాదోపవాదాలు అక్కడే చేసుకోవచ్చని అత్యున్నత న్యాయ స్థానం తేల్చేసింది.
చాలా రోజులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంలో రిలీఫ్ వచ్చింది. రుషికొండలో అక్రమ తవ్వకాలపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ను హైకోర్టుకు బదిలీ చేసింది. అదేవిధంగా ఈ కేసులో మెరిట్స్ పై ఎటువంటి కామెంట్స్ చేయబోమని కూడా చెప్పింది. ఓ విధంగా ఇప్పటి దాకా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కొనసాగించుకోవచ్చని కూడా సుప్రీం చెప్పడంతో జగన్ వర్గాలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక కేసు హై కోర్టు పరిధిలోనే ఉండనుంది.వాస్తవానికి ఇక్కడ మట్టి తవ్వకాలు అన్నవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వివాదాస్పద ఎంపీ ఆర్ఆర్ఆర్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. కానీ కోర్టు మాత్రం ఆయన వాదనకు సమర్థింపు ఇవ్వలేదు. సానుకూలత వ్యక్తం చేయలేదు.
నేషనల్ గ్రీన్ కోర్ లో జరుగుతున్న విచారణను సైతం కొట్టివేస్తూ తదుపరి విచారణను హైకోర్టు పరిధిలోనే తేల్చుకోవాలని చెప్పిందని ప్రధాన మీడియా చెబుతోంది. దీంతో ఆర్ఆర్ఆర్ వర్గాలు డీలా పడ్డాయి. ఇప్పటికే అక్కడ మట్టి తవ్వకాలపై నేషనల్ గ్రీన్ కోర్ అభ్యంతరాలు చెబుతూ , రాష్ట్ర ప్రభుత్వానికి పలు సార్లు నోటీసులు కూడా ఇచ్చింది. వీటిని ఆధారంగా చేసుకునే విశాఖ టీడీపీ కూడా పోరాడుతోంది. రుషికొండను కాపాడుకుంటామని అంటోంది. అయితే వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనూ ఇక్కడ మట్టి తవ్వకాలు సాగాయని ప్రజా హక్కుల సంఘాలు అంటున్నాయి.
ఇక జగన్ వర్గం మాత్రం మరో విధంగా అంటోంది. తాము పర్యావరణ పరంగా సానుకూలంగా ఉంటూనే అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది. అయితే ఇక్కడ ఉన్న నిర్మాణాల స్థానంలో వరుణ్ లాంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. అసలు ఇక్కడ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నిర్మాణాలు చేపడుతుందో కూడా తమకు అర్థం కావడం లేదని కూడా టీడీపీ అంటోంది. అయితే వైసీపీ మాత్రం టూరిజం హబ్ గా విశాఖను చేయాలన్న ప్రధానోద్దేశంతోనే నోవాటెల్ లాంటి సంస్థలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెబుతోంది. అంతేకానీ మరో ఉద్దేశంతో తాము ఈ పనులు చేపట్టడం లేదని క్లారిఫై చేస్తోంది.