బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 11 మంది నిందితులను విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ వార్త తీవ్ర దుమారం రేపింది. గుజరాత్ ప్రభుత్వ తీరును విపక్షాలు ఖండించాయి.
ఈ క్రమంలో సుప్రీంకోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులను ఎలా విడుదల చేశారనే అంశంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విడుదల గురించి వివరణ ఇవ్వాలని తెలిపింది. కాగా, 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అలాగే ఆమె కుటుంబాన్ని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు.